వంగదేశాన్ని సూర్యవంశానికి చెందిన సులక్షణ మహారాజు పరిపాలించేవాడు. అతను ధైర్యవంతుడు, బలశాలి, ధర్మ పరాయణుడు. రాజ్యాన్ని సమర్థంగా పాలిస్తున్నా, అతనికి పుత్రసంతానం లేకపోవడం అతని మనసుకు మిక్కిలి బాధ కలిగించేది. “అపుత్రస్య గతిర్నాస్తి” అనే విధంగా తన వంశం ఎలా కొనసాగుతుందోనని ఆయన చింతించేవాడు.
ఒకసారి, మహారాజు తన రధంలో నైమిశారణ్యానికి వెళ్లి అక్కడి మునుల దర్శనం చేసుకున్నాడు. మునులకు నమస్కరించి, తన బాధను వివరించాడు: "నా నూర్గురు భార్యలున్నా, నాకు పుత్రసంతానం కలగలేదు. దయచేసి నాకీ సమస్యకు పరిష్కారం చెప్పండి."
మునులు రాజుని జాలి గల దృష్టితో చూశారు. "రాజా! నీవు పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశాన్ని పాలించేవాడివి. కానీ మాఘ మాసంలో ఒకసారి కూడా స్నానం చేయలేదు, దానం చేయలేదు. కనీసం ఒక సద్బ్రాహ్మణునికి గుమ్మడికాయను కూడా దానం చేసి ఉంటే, ఈ జన్మలో పుత్రసంతానం కలిగేది. మాఘ మాస శుద్ధ సప్తమి రోజున కూష్మాండ (గుమ్మడికాయ) దానం చేసిన వారికి పుత్రసంతానం తప్పకుండా కలుగుతుంది." అని చెప్పి, మహారాజుకు ఒక ఫలాన్ని మంత్రించి ఇచ్చారు. "ఈ ఫలాన్ని నీ భార్యలలో ఎవరికైనా సేవింపజేయుము, వారు పుత్రప్రాప్తి పొందుదురు." అని మునులు అనుగ్రహించారు.
ఆఫలాన్ని తీసుకుని సంతోషంగా రాజు తన రాజప్రాసాదానికి చేరుకున్నాడు. ఆయన రాకను ఆలకించిన పట్టమహిషులు రాజును మంగళహారతులతో ఆహ్వానించి, విశ్రాంతిని కల్పించారు. రాజు మునుల ఉపదేశాన్ని వివరించి, భోజనానంతరం ఆ ఫలాన్ని సేవించవలసిందిగా చెప్పి తన గదిలో భద్రపరిచాడు.
అయితే, అతని భార్యలలో ఒకరికి ఆ ఫలాన్ని స్వయంగా భుజించాలనే ఆశ కలిగింది. అందుకు ఎవరికి తెలియకుండానే రహస్యంగా రాజు పడకగదిలోకి వెళ్లి ఆ ఫలాన్ని తాను పూర్తిగా భుజించింది. తరువాత ఏమీలేదన్నట్టు తిరిగి అందరితో కలసి సంచరించసాగింది.
ఈ కథ ద్వారా మాఘ మాసంలో కూష్మాండ దానానికి ఉన్న విశేషతను మనం గ్రహించవచ్చు. దాన ధర్మానికి ఉన్న ప్రాముఖ్యతను ఈ చరిత్ర తెలియజేస్తుంది.
మరిన్ని మాఘ పురాణాలు చూడండి.
0 Comments